Sunday, 13 September 2026

 




వినాయక గాథ

కైలాస పర్వతం… పార్వతీదేవి స్నానానికి సిద్ధమవుతూ, నలుగు పిండితో ఒక బాలుడి రూపాన్ని మలచి ప్రాణం పోసింది. అద్భుతమైన తేజస్సుతో జన్మించిన ఆ బాలుడిని ద్వారం వద్ద కాపలా ఉండమని, ఎవరినీ లోపలికి రానివ్వవద్దని ఆదేశించింది.

కొద్దిసేపటికి పరమశివుడు అక్కడికి వచ్చాడు. తల్లి ఆజ్ఞకు కట్టుబడిన ఆ బాలుడు పరమేశ్వరుడిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. తీవ్ర కోపానికి గురైన శివుడు తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి దుఃఖంతో ఆగ్రహించింది. దేవతలందరూ భయపడి, జగన్మాతను శాంతింపజేయడానికి సిద్ధమయ్యారు. 

ఉత్తర దిశగా తలపెట్టి నిద్రపోతున్న ప్రథమ ప్రాణి శిరస్సును తీసుకురావాలని నందిని ఆజ్ఞాపించాడు శివుడు. నంది ఒక ఏనుగు శిరస్సును తీసుకురాగా, శివుడు దానిని బాలుడి శరీరానికి జోడించి ప్రాణం పోశాడు. ఆ బాలుడే గజాననుడు (వినాయకుడు, గణపతి).

దేవతలందరిలో ఎవరు అధికుడో తేల్చేందుకు ఒకసారి ముక్కోటి దేవతల మధ్య పోటీ ఏర్పడింది. "ఎవరైతే ముల్లోకాలను ముందుగా చుట్టి వస్తారో వారికే ప్రథమ పూజార్హత లభిస్తుంది" అని శివుడు ప్రకటించాడు. దేవతలందరూ తమ వేగవంతమైన వాహనాలపై లోకాలను చుట్టిరావడానికి బయలుదేరారు.

అత్యంత బుద్ధిమంతుడైన వినాయకుడు తన వాహనమైన మూషికం (ఎలుక)పై అంత దూరం ప్రయాణించడం సాధ్యం కాదని గ్రహించాడు. తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులే సకల లోకాలకు మూలమని ఎరిగి, వారి చుట్టూ భక్తితో మూడు ప్రదక్షిణలు చేశాడు. ఆయన భక్తికి, సమయస్ఫూర్తికి మెచ్చిన పరమశివుడు వినాయకుడిని సమస్త గణాలకు అధిపతిగా (గణపతి) అభిషేకించి, ఏ పూజ లేదా కార్యం ప్రారంభించినా ప్రథమ పూజ ఆయనకే చెందుతుందని వరమిచ్చాడు.

వేద వ్యాసుడు భారతాన్ని రచిస్తూ, తాను ఆపకుండా చెబుతుంటే ఏకధాటిగా రాయగల సమర్థుడి కోసం వెతకగా వినాయకుడు అంగీకరించాడు. రాసే సమయంలో గంటము విరిగిపోతే, ఆటంకం కలగకూడదని తన ఏకదంతాన్ని విరిచి దాంతో గ్రంథాన్ని పూర్తి చేశాడు. అందుకే ఆయనను ఏకదంతడు అని పిలుస్తారు.

—--------

శివపురాణ ప్రకారం, పెళ్లీడు వచ్చిన గణపతికి శివపార్వతులు విశ్వకర్మ కుమార్తెలయిన  సిద్ధి (సమర్థత/సిద్ధి),బుద్ధి (తెలివి/జ్ఞానం) అనే ఇద్దరితో వినాయకునికి వైభవంగా వివాహం జరిపించారు.

సిద్ధి ద్వారా జన్మించిన కుమారుడు క్షేమం (శుభం). బుద్ధి ద్వారా జన్మించిన కుమారుడు లాభం.  అందుకే ఏ పూజ లేదా శుభకార్యం జరిగినా క్షేమ-లాభాలు సిద్ధించాలని కోరుకుంటారు. కొన్ని ఉత్తరాది జానపద కథలు, పురాణ కథనాల ప్రకారం, వినాయకుని కుమార్తెగా సంతోషి మా (సంతోష దేవత)ని ఆరాధిస్తారు.

అయితే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో,  అలాగే నిర్దిష్ట సంప్రదాయాలలో వినాయకుడిని ఆజన్మ బ్రహ్మచారిగా పరిగణిస్తారు.

ఆయన తన తల్లి అయిన పార్వతీదేవి అంతటి రూపవతి, గుణవతి అయిన స్త్రీ లభిస్తేనే వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడని, అటువంటి స్త్రీ ఎక్కడా కనిపించకపోవడంతో బ్రహ్మచారిగానే ఉండిపోయాడని ఒక కథనం ప్రచారంలో ఉంది.

అందువల్లే కొన్ని ఆలయాల్లో వినాయకుడు ఒంటరిగా (బ్రహ్మచారి రూపంలో) దర్శనమిస్తే, మరికొన్ని ఆలయాల్లో సిద్ధి, బుద్ధి సమేత శ్రీ మహాగణపతిగా దర్శనమిస్తాడు.

వినాయకుని వివాహం, సంతానం కేవలం ఒక లౌకిక కథ మాత్రమే కాదు.దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక తత్త్వం ఉంది.

వినాయకుడు జ్ఞానానికి, అధిపతిత్వానికి ప్రతీక.సిద్ధి, బుద్ధి అంటే సద్బుద్ధి ఉన్న చోట విజయం/సిద్ధి  తప్పక లభిస్తాయి.

క్షేమం,లాభం అంటే బుద్ధి, సిద్ధులు తోడైనప్పుడు జీవితంలో క్షేమం (సురక్షితత్వం), లాభం (అభివృద్ధి) లభిస్తాయి.

—-----------

హిందూ పురాణాలలో, ముఖ్యంగా గణేశ పురాణం, ముద్గల పురాణంలలో వినాయకుడు ధర్మాన్ని పరిరక్షించడానికి, లోక కల్యాణం కోసం వివిధ అవతారాలు ఎత్తి దైత్యులను, రాక్షసులను సంహరించడానికి చేసిన అనేక యుద్ధాల ప్రస్తావన ఉంది.

సింధురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద అపారమైన వరాలు పొంది దేవతలను, మునులను తీవ్రంగా వేధించేవాడు. రక్తం, సింధూరం లాంటి శరీర ఛాయతో ఉండి లోకాన్ని భయకంపితుడిని చేసేవాడు. పార్వతీ, పరమేశ్వరుల అనుగ్రహంతో గణపతి గజానన రూపంలో సింధురాసురుడిపై దండయాత్ర చేశాడు. సుదీర్ఘమైన భీకర యుద్ధం తర్వాత వినాయకుడు ఆ రాక్షసుడిని సంహరించా డ. ఆ రాక్షసుడి రక్తంతో తయారుచేసిన సింధూరాన్ని స్వామి తన శరీరమంతా పులుముకున్నాడు. నాటి నుంచిన గణపతికి సింధూరంతో పూజ చేయడం ఆనవాయితీగా మారింది.. 

 గజాసురుడు అనే అసురుడు పరమశివుని భక్తుడైనప్పటికీ, అహంకారంతో దేవతలను ఇబ్బంది పెట్టసాగాడు.

 గణపతి తన ఆయుధాలైన పరశువు (గండ్రగొడ్డలి), పాశం, అంకుశంతో గజాసురుడితో ఘోర యుద్ధం చేశాడు.

 యుద్ధంలో ఓడిపోయిన గజాసురుడు తన తప్పు తెలుసుకుని, తన శిరస్సును స్వామి ధరించాలని, తన చర్మాన్ని శివుడు ధరించాలని ప్రార్థించాడు. వినాయకుడు అతని కోరికను మన్నించి గజముఖుడిగా విలసిల్లాడు.

. అభినందనుడు అనే రాజు చేసిన యజ్ఞాన్ని భంగం చేయడానికి ఇంద్రుని కోపం నుంచి విఘ్నాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడు లోకంలో ఏ శుభకార్యం జరిగినా విఘ్నాలు (ఆటంకాలు) సృష్టిస్తూ ధర్మాన్ని నాశనం చేసేవాడు

 దేవతల ప్రార్థన మేరకు గణపతి విఘ్నాసురుడిపై యుద్ధానికి దిగాడు. వినాయకుని పరాక్రమానికి, ఆయుధ మహిమకు భయపడిన విఘ్నాసురుడు స్వామి పాదాలపై పడి శరణు వేడాడు.

 ఇకపై తన భక్తులు చేసే ఏ కార్యంలోనూ ఆటంకాలు కలిగించవద్దని స్వామి ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా, విఘ్నాసురుడు తన పేరును స్వామి నామంతో జతచేయమని కోరడంతో స్వామికి విఘ్నేశ్వరుడు అనే పేరు వచ్చింది

 ఇంద్రుని వల్ల పుట్టిన మత్సరాసురుడు (ఈర్ష్య, అసూయలకు ప్రతీక) సకల లోకాలను జయించి, దైవచింతన లేకుండా చేశాడు

 దత్తాత్రేయుని ఉపదేశంతో వినాయకుడు వక్రతుండ అవతారాన్ని ఎత్తి, తన సింహ వాహనంపై వచ్చి మత్సరాసురుడి సైన్యాన్ని అంతం చేశాడు. స్వామి తేజస్సును చూసి భయపడిన మత్సరాసురుడు శరణాగతి వేడాడు

మదాసురుడు (అహంకారానికి ప్రతీక) రాక్షస గురువైన శుక్రాచార్యుని అనుగ్రహంతో ముల్లోకాలను పరిపాలించసాగాడు

 సనత్కుమారుల ప్రార్థనతో స్వామి ఏకదంత రూపాన్ని ధరించి, తన ఏకదంతం, పాశంతో మదాసురుడిని ఎదిరించాడు. స్వామి శక్తి ముందు నిలబడలేక మదాసురుడు లొంగిపోయాడు

 లలితా దేవి బండారకాసురుడితో చేసిన మహాయుద్ధంలో, రాక్షసుడు ప్రయోగించిన "విఘ్న యంత్రాన్ని" నాశనం చేయడానికి గణపతి మహా గణపతి రూపంలో అవతరించి, ముద్రాసురుడు అనే రాక్షసుడిని,అతని సైన్యాన్ని సంహరించాడు.

 పరమశివుడు త్రిపురాసురులను సంహరించే ముందు విఘ్నేశ్వరుడిని పూజించకపోవడం వల్ల రథచక్రం విరిగిపోయింది. ఆ తర్వాత శివుడు వినాయకుని పూజించి, ఆయన అనుగ్రహంతో త్రిపురాసురులపై విజయం సాధించాడు

వినాయకుడు చేసిన యుద్ధాలు కేవలం భౌతికమైన పోరాటాలు మాత్రమే కావు. ఆయన సంహరించిన రాక్షసులు మానవులలో ఉండే దుర్గుణాలకు ప్రతీకలు:

 మత్సరాసురుడు = ఈర్ష్య / అసూయ

 మదాసురుడు = అహంకారం

 కామాసురుడు = కామం / దురాశ

 మోహాసురుడు = వ్యామోహం

ఈ వికారాలను నాశనం చేసి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడమే వినాయకుని యుద్ధాల అంతరార్థం

—--------

వినాయకుడి మహిమలు కేవలం కథలకే పరిమితం కాకుండా, ఆయన లోతైన ఆధ్యాత్మిక శక్తికి, భక్తుల రక్షణకు నిదర్శనంగా నిలుస్తాయి. 

రావణుడు అమరుడవుతాడని భావించి దేవతలందరూ ఆందోళన చెందారు. విష్ణువు సూర్యాస్తమయం అయ్యేలా మాయ చేయగా, సంధ్యావందనం చేసుకోవడానికి రావణుడు ఆత్మలింగాన్ని కింద పెట్టాల్సి వచ్చింది

అప్పుడు గణపతి ఒక చిన్న బ్రహ్మచారి బాలుడిగా ప్రత్యక్షమై, రావణుడి వద్ద నుంచి లింగాన్ని అందుకున్నాడు. రావణుడు వచ్చేలోపు "మూడుసార్లు పిలుస్తాను, రాకపోతే కింద పెట్టేస్తాను" అని చెప్పి, ఆత్మలింగాన్ని నేలపై ప్రతిష్ఠించాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని పెకిలించలేకపోయాడు. ఆ ప్రదేశమే నేటి గోకర్ణ క్షేకర్ణాటక

.అగస్త్య మహర్షి ఒకసారి తన కమండలంలో పవిత్ర జలాలను తీసుకుని దక్షిణాది  ప్రాంతం మీదుగా వెడుతున్నాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం తీవ్ర కరువుతో అల్లాడిపోతోంది. లోక కల్యాణం కోసం వినాయకుడు ఒక కాకి రూపంలో వచ్చి అగస్త్యుని కమండలాన్ని కింద పడేసాడు. ఆ కమండలం నుంచి ప్రవహించిన జలధారే నేటి కావేరీ నది. అలా దక్షిణాదిని సస్యశ్యామలం చేసిన మహిమ గణపతిది.

భాద్రపద చవితి నాడు చంద్రుడిని చూసినందుకు శ్రీకృష్ణుడిపై "శమంతకమణి" దొంగిలించాడనే నిలాపనింద పడింది. కృష్ణుడు వినాయక వ్రతాన్ని ఆచరించి, స్వామిని ఉపాసించడం ద్వారా ఆ నింద నుంచి  విముక్తి పొంది, మణిని తిరిగి  సాధించాడు. సాక్షాత్తు విష్ణు  అవతారమైన శ్రీకృష్ణుడే గణపతి మహిమను చాటిచెప్పాడ

ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకంలో బావిలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం నానాటికీ పరిమాణంలో పెరుగుతూ ఉండటం స్వామి ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. ఇక్కడి స్వామివారి ముందు చేసిన సత్యప్రమాణాలకు తిరుగుండదని భక్తుల నమ్మకం.

వినాయకుడి మహిమల అంతరార్థం ఒక్కటే: బుద్ధికి అధిపతి: వికటమైన సమస్యలనైనా సమయస్ఫూర్తితో పరిష్కరించడం.. కార్యసిద్ధి: హృదయంలో నిజమైన భక్తీ  ఉంటే ఎలాంటి విఘ్నాలనైనా తొలగించి విజయాన్ని అందించడం

 విఘ్న నివారణ: లోకంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా, తనను తలచుకుంటే చాలు విఘ్న సమూహాలను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తాడు.

భారతదేశంలో శ్రీ వినాయక స్వామికి సంబంధించి ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి..

ఆంధ్రప్రదేశ్‌లోని  తిరుపతి సమీపంలోని  కాణిపాకంలో శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఉంది . ( ఇక్కడ స్వామివారు బావిలో స్వయంభువుగా వెలిశారు. ఈ విగ్రహం నానాటికీ పరిమాణంలో పెరుగుతూ ఉండటం ఇక్కడి గొప్ప మహిమ. ఇక్కడి స్వామివారి ప్రాంగణంలో ప్రమాణం చేస్తే అసత్యాలు చెప్పరని, సత్యప్రమాణాలకు ఇది అత్యంత పవిత్ర క్షేత్రమని నమ్ముతారు.

తూర్పు గోదావరి జిల్లా  అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం  కోనసీమ ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన, మహిమాన్వితమైన వినాయక క్షేత్రం. ఏ పని ప్రారంభించినా ఇక్కడ పూజ చేస్తే విఘ్నాలు తొలగి విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం.

మహారాష్ట్రలో పూణే, పరిసర ప్రాంతాలలో ఉన్న 8 స్వయంభూ వినాయక ఆలయాలను కలసి "అష్టవినాయక క్షేత్రాలు" అని పిలుస్తారు. ఈ ఎనిమిది ఆలయాలను దర్శించడం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు:

1. మయూరేశ్వర్ (మోర్గావ్): అష్టవినాయక యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభమై ఇక్కడే ముగుస్తుంది.

2. సిద్ధివినాయక్ (సిద్ధటెక్): విష్ణుమూర్తి మధుకైటభులనే రాక్షసులను సంహరించేందుకు ఇక్కడి వినాయకుడిని పూజించాడని కథనం.

3. బల్లాలేశ్వర్ (పాలి): భక్తుడైన బల్లాలుడి పేరు మీద వెలిసిన స్వామి.

4. వరదవినాయక్ (మహద్): ఇక్కడ నందామయ దియా (అఖండ దీపం) శతాబ్దాలుగా వెలుగుతోంది.

5. చింతామణి (థేఊర్): పూణే జిల్లాలోని థేఊర్ వద్ద ముతా నది ఒడ్డున ఉంది. భక్తుల చింతలను  తొలగించే దేవుడు.

6.గిరిజాత్మజుడు (లేన్యాద్రి): పూణే జిల్లాలోని జున్నార్ దగ్గర కొండపై ఉన్న గుహలో ఈ ఆలయం ఉంది. పార్వతీదేవి (గిరిజ) పుత్రుడిగా ఇక్కడ వినాయకుడు కొలువయ్యాడు.

7. విఘ్నేశ్వర్ (ఓజర్): విఘ్నాసురుడనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశం.

8. మహా గణపతి (రంజన్‌గావ్): త్రిపురాసుర సంహారానికి ముందు శివుడు ఈ స్వామిని ఆరాధించాడు.

 ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు

 శ్రీ సిద్ధివినాయక మందిరం (ముంబై, మహారాష్ట్ర): భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన, అత్యంత ప్రాచుర్యం పొందిన గణపతి ఆలయాల్లో ఒకటి. 

 శ్రీ దొడ్డ గణపతి ఆలయం (బెంగళూరు, కర్ణాటక): బసవనగుడి ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో ఏకశిలలో చెక్కిన భారీ వినాయక విగ్రహం ఉంటుంది. స్వామివారికి చేసే వెన్నాలంకరణ (వెన్న పూత) చాలా ప్రసిద్ధి.

శ్రీ అరుళ్మిగు ముంది వినయగర్ ఆలయం (కోయంబత్తూర్, తమిళనాడు): పులియాకుళంలో ఉన్న ఈ ఆలయంలో ఆసియాలోనే అతిపెద్ద ఏకశిలా వినాయక విగ్రహాలలో ఒకటి ప్రతిష్ఠించబడింది.

ఏ క్షేత్రమైనా స్వామివారిని భక్తితో స్మరించి, మూషిక వాహనుడికి గరిక, ఉండ్రాళ్లు, జిల్లేడు పూలతో పూజ చేస్తే సకల విఘ్నాలు తొలగి కార్యసిద్ధి లభిస్తుంది.

——-

వినాయకుడు పుట్టిన భాద్రపద శుద్ధ చతుర్థి నాడే వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటారు. భారతీయుల అతిముఖ్య పండుగలలో వినాయక చవితి ఒకటి. గణేశుడి ఆవిర్భావం భాద్రపద శుక్ల చతుర్థి రోజున జరిగిందనే సంప్రదాయం ఏర్పడింది. అందుకే ఆ రోజును గణేశ చతుర్థి లేదా వినాయక చవితిగా పూజించడం ప్రారంభమైంది.

విఘ్నాలను తొలగించే దేవుడిగా, జ్ఞానం - బుద్ధి - విజయాలకు అధిదేవతగా భావించే శ్రీ గణేశుడిని ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ఈ రోజున మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి, పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ప్రాంతీయ ఆచారాలనుబట్టి పూజా విధానాలు, ఉత్సవాల వ్యవధి మారవచ్చు.

వినాయకుడి పూజ భారతదేశంలో చాలా ప్రాచీనమైనది. కానీ ఇళ్లలో జరిగే పూజను దాటి, పెద్ద పెద్ద సామూహిక ఉత్సవాలుగా మార్చడంలో 19వ శతాబ్దం చివరలో బాల గంగాధర్ తిలక్ కీలక పాత్ర పోషించారు.

ప్రత్యేకంగా మహారాష్ట్రలో, బ్రిటిష్ పాలన సమయంలో ప్రజలను ఒకచోట చేర్చి సామాజిక చైతన్యం కల్పించేందుకు గణేశోత్సవాన్ని ప్రజా ఉత్సవంగా ప్రోత్సహించారు. దీంతో వినాయక చవితి ఇంటి పూజ నుంచి భారీ సామూహిక ఉత్సవంగా విస్తరించింది.

వినాయక పూజలో 21 రకాల పత్రాలను సమర్పించే సంప్రదాయం ఉంది. దీనిని ఏకవింశతి పత్రి పూజ అంటారు.

వివిధ ప్రాంతాల్లో పత్రి జాబితాలో కొంత మార్పు కనిపించినప్పటికీ, సాధారణంగా వినాయకుడికి వివిధ ఔషధ గుణాలు కలిగిన ఆకులను సమర్పిస్తారు. వాటి పేర్లు: 1. మాచీ పత్రం/మాచిపత్రి 2. బృహతీ పత్రం/ములక 3. బిల్వ పత్రం/మారేడు 4. దూర్వా పత్రం/గరిక 5. దత్తూర పత్రం/ఉమ్మెత్త 6. బదరీ పత్రం/రేగు 7. అపామార్గ పత్రం/ఉత్తరేణి 8. తులసీ పత్రం/తులసి 9. చూత పత్రం/మామిడి 10. కరవీర పత్రం/గన్నేరు 11. విష్ణుక్రాంత పత్రం/శంఖపుష్పం 12. దాడిమీ పత్రం/దానిమ్మ 13. దేవదారు పత్రం/దేవదారు 14. మరువక పత్రం/ధవనం, మరువం 15. సింధువార పత్రం/వావిలి 16. జాజి పత్రం/జాజిమల్లి 17. గండకీ పత్రం/లతాదూర్వా (కామంచి ఆకులు) 18. శమీ పత్రం/జమ్మి 19. అశ్వత్థ పత్రం/రావి 20. అర్జున పత్రం/ తెల్ల మద్ది 21. అర్క పత్రం/జిల్లేడు.

ఇందులో భక్తి మాత్రమే కాకుండా ప్రకృతి, వృక్ష సంపద, ఆరోగ్యం పట్ల గౌరవం అనే భావన కూడా అంతర్లీనంగా ఉందని చెప్పవచ్చు.

వినాయక చవితి సందర్భంగా ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు వంటి నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీ.

ముఖ్యంగా మోదకం గణేశుడికి ఎంతో ప్రీతికరమైనదిగా పురాణ సంప్రదాయంలో భావిస్తారు.

బియ్యం, బెల్లం, కొబ్బరి వంటి పదార్థాలతో తయారు చేసే ఈ నైవేద్యాలు మన సంప్రదాయ ఆహార సంస్కృతిలో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి.

ఒకసారి వినాయకుడు భోజనం చేసి వస్తుండగా, ఆయన రూపాన్ని చూసి చంద్రుడు పరిహసించాడు. దాంతో "చవితి నాడు నిన్ను చూసినవారు నిలాపనిందలు ఎదుర్కొంటారు" అని వినాయకుడు శాపమిచ్చాడు. తరువాత క్షమించి, ఆ రోజున వినాయక వ్రతం చేసి, కథ విని, అక్షతలు శిరస్సున వేసుకుంటే ఆ దోషం తొలగిపోతుందని ఉపశమనం చెప్పాడు.

గణేశుడికి ఎలుక వాహనం గురించి కూడా ఎంతో అర్థవంతమైన వ్యాఖ్యానం చెబుతారు. ఎలుక చిన్నదైనా ఎక్కడికైనా చొచ్చుకుపోగలదు. మనిషి మనసులోని కోరికలు, చంచలత్వం, ఆశలు కూడా అలాగే ఎటూ తిరుగుతుంటాయని ఒక తాత్త్విక వ్యాఖ్యానం. గణేశుడు ఎలుకపై కూర్చోవడం అంటే జ్ఞానం, వివేకం ద్వారా చంచలమైన మనస్సును అదుపులో ఉంచడం అనే భావాన్ని సూచిస్తుందని వివరిస్తారు.

పూజ పూర్తయిన తర్వాత విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం "సృష్టిలో పుట్టిన ప్రతిదీ తిరిగి ప్రకృతిలోనే లీనమవుతుంది" అనే గొప్ప తత్వజ్ఞానాన్ని చాటుతుంది.

వినాయక చవితి వెనుక పురాణ విశ్వాసం ఒక వైపు, దాని వెనుక ఉన్న తాత్త్విక సందేశం మరో వైపు ఉన్నాయి.

ఏనుగు తల → జ్ఞానం, బలం
 పెద్ద చెవులు → ఎక్కువగా వినాలి
 చిన్న కళ్ళు → ఏకాగ్రత
 పెద్ద పొట్ట → మంచి–చెడు అనుభవాలను జీర్ణించుకోవడం
 ఏకదంతం → ఏకాగ్రత, త్యాగం
 మూషిక వాహనం → కోరికలపై నియంత్రణ

అందుకే గణేశుడి రూపమే ఒక జీవన సందేశంగా భావించవచ్చు.

వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. విఘ్నాలను అధిగమించి, బుద్ధితో విజయపథంలో ముందుకు సాగాలని గుర్తుచేసే చైతన్య పర్వదినం.

విఘ్నాలను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించి, సత్కార్యాలకు విజయాన్ని అందించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిద్దాం. ప్రకృతిని కాపాడుతూ, మట్టి వినాయకుడితో పర్యావరణహితమైన వినాయక చవితిని జరుపుకుందాం. *



No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...