బ్రహ్మోత్సవ వైభవం
-జీడిగుంట నాగేశ్వరరావు
శ్రీనివాసుని లీలలు అనంతమైనవి. ఆ ఏడుకొండల స్వామి కిరీటం నుంచి పాదపద్మాల వరకు ప్రతి భాగం లోనూ, రూపంలోనూ, ప్రతి అర్చనలోనూ దివ్యత్వం ఉట్టిపడుతుంది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో నిత్యకల్యాణం పచ్చతోరణంగా సాగే ఉత్సవాలలో అత్యంత పవిత్రమైనవి, వైభవపేతమైనవి బ్రహ్మోత్సవాలు.
ఈ బ్రహ్మోత్సవాలకు ఒక సుదీర్ఘమైన, పరమ పవిత్రమైన నేపథ్యం ఉంది. బ్రహ్మదేవుడే స్వయంగా భూలోకానికి వేంచేసి, లోకకళ్యాణార్థం శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రథమంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం వల్ల వీటికి "బ్రహ్మోత్సవాలు" అని పేరు వచ్చింది. అప్పటి నుంచి నుండి నేటి వరకు ఆ దివ్య సాంప్రదాయం నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది.
సాధారణంగా ప్రతి ఏటా జరిగే వార్షిక ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. అయితే, అధిక మాసం వచ్చే సంవత్సరాల్లో, స్వామివారికి ద్విగుణీకృత వైభవంతో రెండవదిగా అశ్వయుజ మాసంలో, దేవీ నవరాత్రుల సమయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే దివ్య మహోత్సవాలే నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
ప్రతీ ఏడు భాద్రపద మాసంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లోతొమ్మిది రోజుల పాటు ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.
బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా మొదట అంకురార్పణ చేసి, తదనంతరం గరుడ పటం ఆరోహణం (ధ్వజారోహణం) చేయడంతో ఉత్సవాలు అధికారికంగా మొదలవుతాయి. ఈ కార్యక్రమం ద్వారా ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు.
తొమ్మిది రోజుల పాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఉదయం, సాయంత్రం వేర్వేరు వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.
వీటిలో ప్రధానమైనవి శేష వాహనం, హంస, సింహ, ముత్యపుపందిరి, హనుమంత, గరుడ, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ మొదలైనవి.
బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు రాత్రి జరిగే గరుడ సేవ అత్యంత ప్రాధాన్యమైనది. ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు.
ఎనిమిదో రోజున వైభవంగా రథోత్సవం జరుగుతుంది. తొమ్మిదో రోజున స్వామివారి చక్రత్తాళ్వార్‌తో పుష్కరిణిలో "చక్రస్నానం" నిర్వహిస్తారు. దీంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పూర్తవుతాయి.
సాధారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. అయితే అధిక మాసంలో రెండవసారి చేసే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం ఉండదు.
ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి (15, సెప్టెంబర్) నుంచి ప్రారంభమయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 20 వరకు జరుగుతాయి.
ఓం నమో వెంకటేశాయ…🙏
No comments:
Post a Comment