Thursday, 17 September 2026

 లేతమనసులు (1966)


జర్మన్ రచయిత ఎరిక్ కాస్ట్నర్ రాసిన ‘లిసా అండ్ లోట్టి’ అనే నవల ఆధారంగా ‘ద పేరెంట్ ట్రాప్’ పేరుతో హాలీవుడ్ మూవీ వచ్చింది. దాని ఆధారంగా ఏవీయమ్ సంస్థ తమిళంలో ‘కుళందైయుమ్ దైవముమ్’ సినిమా నిర్మించింది. అదే ఏవీయమ్ సంస్థ  ‘కుళందైయుమ్ దైవముమ్’ ను తెలుగులో ‘లేతమనసులు‘ చిత్రాన్ని తెరకెక్కించింది. 

తమిళంలోనూ, తెలుగులోనూ కూడా జమున హీరోయిన్ గా నటించగా ఆమె కూతుళ్ళుగా కుట్టి పద్మిని రెండు వెర్షన్ల లోనూ ద్విపాత్రాభినయం చేశారు. కృష్ణన్ - పంజు దర్శకత్వం వహించారు. 1966 సెప్టెంబర్ 16వ తేదీన విడుదలైన ‘లేతమనసులు’ ఆ యేడాది టాప్ సినిమాల్లో ఒకటిగా నిలచింది. ఈ నెల 16 తో ఈ చిత్రానికి 60 ఏళ్లు నిండాయి.

డబ్బున్న అమ్మాయి సత్యభామ ( జమున) సామాన్యుడైన శేఖర్ ( హరనాథ్) ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. వారికి కవల పిల్లలు లల్లీ, పప్పీ ( కుట్టి పద్మిని) పుడతారు. సత్యభామ తల్లి ( జీ. వరలక్ష్మి) అహంకారం కారణంగా శేఖర్ భార్య నుంచి విడిపోయి తనతో పాటు ఓ కూతురును తీసుకువెళతాడు. తరువాత ఆ పిల్లలిద్దరూ ఒకే స్కూల్‌లో కలుసుకుంటారు. తాము కవల పిల్లలమన్న నిజం తెలుసుకుంటారు. ఇద్దరూ కలసి  కన్నవారిని కలపడమే ఈ సినిమా కథ.

‘లేతమనసులు’ చిత్రానికి డి.వి. నరసరాజు రచన చేశారు. పాటలను ఆరుద్ర, దాశరథి రాశారు. యమ్మెస్ విశ్వనాథన్ స్వరకల్పనలో పాటలు - అందాల ఓ చిలకా, పిల్లలూ దేవుడూ చల్లని వారే, కోడి ఒక కొనలో, హలో మేడం సత్యభామ,అందాల ఈ రేయి - విశేషాదరణ పొందాయి.  

చైల్డ్ సెంటిమెంట్ ఈ సినిమాకు ఘనవిజయం దక్కేలా చేసింది. రిపీట్ రన్స్‌లోనూ ‘లేతమనసులు’ విశేషంగా ఆకట్టుకుంది. 


ఇదే కథతో హిందీలో ‘దో కలియా’, మళయాళంలో ‘సేతుబంధనం’, కన్నడలో ‘మక్కల భాగ్య’ రూపొందాయి. హిందీ చిత్రానికి  కూడా కృష్ణన్-పంజు దర్శకత్వం వహించారు. ఈ మూడు సినిమాలను ఏవీయమ్ సంస్థ నిర్మించింది.* 


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...