కోడలు దిద్దిన కాపురం (1970)
ఎన్టీఆర్ ఎస్టేట్స్ బ్యానర్ పై త్రివిక్రమరావు నిర్మించిన కోడలు దిద్దిన కాపురం ఉత్తమ విలువలు ఉన్న కుటుంబ కథా చిత్రంగా విశేష ఆదరణ పొందింది. 175 రోజులు ఆడిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రెండో ఉత్తమ చిత్రంగా రజత నంది అవార్డు అందుకుంది. ఇది ఎన్టీఆర్ 200వ చిత్రం కావడం విశేషం. ఆయనే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించారు.
1970 అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రానికి డీ.యోగానంద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డీవీ నరసరాజు మాటలు రాయగా టీ వీ రాజు సంగీతం అందించారు.
రావ్ బహద్దూర్ ( నాగభూషణం) కోటీశ్వరుడు.అతని భార్య కాంతమ్మ ( సూర్యాకాంతం) అమాయకురాలు, మూఢనమ్మకాలు ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, కుట్రలు పన్నే సచ్చిదానంద ( సత్యనారాయణ )వారి ఇంట్లోకి చొరబడి, వారి సంపదను దోచుకుంటాడు. రావు బహదూర్‌కు రాము (జగ్గయ్య) రంగ ( ఎన్టీఆర్) అనే ఇద్దరు కుమారులు, శోభ (సంధ్యారాణి) అనే ఒక కుమార్తె ఉంటారు. రాము, సద్గుణవంతురాలైన లక్ష్మి (సావిత్రి) ని వివాహం చేసుకుంటాడు, కానీ ఆమె సాంప్రదాయ విలువలను ద్వేషిస్తూ, మాల (విజయలలిత) అనే డాన్సర్ పై మోజుపడతాడు. రంగ మంచి స్వభావం గలవాడైనప్పటికీ, కుటుంబ ఆప్యాయత లేకపోవడం వల్ల తాగుబోతుగా మారతాడు. ఆధునిక, మొండి పట్టుదల గల శోభ, తన విధేయుడైన భర్త శంకరాన్ని ( పద్మనాభం) శాసిస్తుంది. కుటుంబంలోని ఈ గందరగోళం చాలా మంది పనివాళ్లను పనిలోంచి తీసివేయడానికి కూడా దారితీస్తుంది, చివరికి నమ్మకస్తుడైన ముసలయ్య (త్యాగరాజు) మాత్రమే వారి సేవలో మిగిలిపోతాడు. లక్ష్మి ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు, రాము విడాకులు కోరతాడు. అయితే వారు చట్టపరంగా కొంతకాలం కలిసి జీవించాల్సి ఉంటుంది. ఈ సమయంలో, లక్ష్మి కుటుంబ సంబంధాలను మార్చడం ప్రారంభిస్తుంది. ఆమె రంగలో మార్పు తెస్తుంది. ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో పరిస్థితులు మార్చేందుకు కృషి చేస్తారు, అవినీతిపరులైన పనివాళ్లను బయటపెట్టి, శోభను ఆమె అత్తగారింటికి తిరిగి వెళ్ళేలా ఒప్పిస్తారు.ముసలయ్య ధైర్యవంతురాలైన మేనకోడలు పార్వతి ( వాణిశ్రీ) సహాయకురాలిగా ఆ ఇంట్లో చేరుతుంది. రంగ ఆమెతో ప్రేమలో పడతాడు. మరోవైపు మారు వేషాలు వేసి మాల వల నుంచి అన్న రామును బయటకు తెస్తాడు. లక్ష్మిలోని సద్గుణాలను రాము గుర్తించేలా చేస్తాడు. లక్ష్మి విడాకుల పత్రాలపై సంతకం చేసి, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయిన లక్ష్మిని కాపాడి రాము కు దగ్గర చేస్తాడు. సచ్చిదానందుడి ద్రోహాన్ని కనిపెట్టి అతడిని అరెస్టు చేయిస్తాడు. రంగ పార్వతిని వివాహం చేసుకోవడంతో చిత్రం సుఖాంతం అవుతుంది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోయిన్ గా వాణిశ్రీ స్థాయి మరింత పెరిగింది. తరువాత చాలా చిత్రాల్లో వీరిద్దరూ జత గట్టారు. ఇద్దరి మధ్యా - నిద్దుర పొరా సామీ - డ్యూయెట్, అందులో ఎన్టీఆర్ కు బాలు గళం- బాగా రక్తి కట్టింది. అంతవరకు ఎన్టీఆర్ కు హీరోయిన్ గా నటించిన సావిత్రి ఈ చిత్రంలో ఆయనకు వదిన పాత్రలో ఒదిగిపోయింది. ఆమెపై చిత్రించిన సినారె గీతం -నీ ధర్మం - పాట ఇప్పటికీ జాతీయ పర్వదినాల్లో వినిపిస్తుంది.*
No comments:
Post a Comment