వరకట్నం (1969)
రామకృష్ణ అండ్ ఎన్.ఎ.టి కంబైన్స్ పై టి. త్రివిక్రమరావు నిర్మించిన వరకట్నం సినిమా 1969 లో విడుదల అయింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అందుకున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌టి రామారావు. మాటలు మద్దిపట్ల సూరి, సముద్రాల జూనియర్ రాశారు.
మీసాల సుబ్బయ్య (నాగభూషణం) ఓ గ్రామానికి మోతుబరి రైతు. కొడుకు దేవసింహ (ఎన్‌టి రామారావు), భార్య కాంతమ్మ (హేమలత). పక్క గ్రామానికి చెందిన మరో మోతుబరి రైతు భద్రయ్య (మిక్కిలినేని). అతని కొడుకు బలరామయ్య (సత్యనారాయణ), కోడలు సుభద్ర (సావిత్రి), కుమార్తె సుజాత (కృష్ణకుమారి). సుబ్బయ్య కుమారునికి భద్రయ్య కుమార్తెకు వివాహం నిశ్చయమవుతుంది. పెళ్లిలో సుబ్బయ్య గ్రామానికి చెందిన పేచీకోరు అచ్చయ్య (అల్లు రామలింగయ్య) తెచ్చిన మాట పట్టింపుతో దేవసింహ సుజాతకు తాళి కట్టకుండా వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అదే గ్రామంలో శ్రీరాములు (పెరుమాళ్లు) సాధారణ రైతు. అతని కూతురు లక్ష్మి (చంద్రకళ). చుక్కమ్మ (సూర్యకాంతం),రంగయ్య (రేలంగి)ల కుమారుడు దేవయ్య (పద్మనాభం) తో లక్ష్మి పెళ్లి కుదురుతుంది. అయితే కట్నం కారణంగా గొడవలు తలెత్తుతాయి. అయినా లక్ష్మికి దేవయ్య తాళికట్టడంతో తప్పనిసరిగా అత్తింటివారు ఆమెను తమతో తీసుకెళ్తారు. కానీ కట్నం పేచీ తో కొడుకు భర్త దేవయ్యను లక్ష్మి కలవకుండా చుక్కమ్మ వేధింపులకు గురి చేస్తుంటుంది. కట్నం కోసం ఆమెపైన, ఆమె తండ్రిపైన నిందలు వేయటంతో లక్ష్మి, శ్రీరాములు కూడా ఇబ్బందులు పడుతుంటారు. లక్ష్మి అన్న సుబ్బన్న (ప్రభాకర్‌రెడ్డి) చెల్లెలి కోసం ఆరాట పడుతుంటాడు. ఇటు దేవసింహ తండ్రి ఆంక్షలు పెట్టినా సుజాతే తన భార్య అని నిశ్చయించుకుంటాడు. తల్లి దీవెన తీసుకుని, సుజాతను ఆమె వదిన సుభద్ర సాయంతో కలుసుకుంటాడు. ఆమెకు తాళికట్టి భార్యగా స్వీకరిస్తాడు. బలరామయ్య తన మిత్రుడు మల్లయ్యదొర (రాజనాల)తో తిరిగి, సుజాతకు పెళ్లి నిశ్చయిస్తాడు. దీనితో దేవసింహ, మల్లయ్యదొర గొడవ పడతారు. బలరామయ్య వలన దేవసింహ గాయపడటంతో మనసు చెదిరిన సుజాత ఆత్మహత్య ప్రయత్నం చేసి మామగారింటికి చేరుతుంది. వారంతా తిరిగి సుజాత ఇంటికి వచ్చి భద్రయ్య, బలరామయ్యతో కలిసి దేవసింహ, సుజాతలను ఆశీర్వదిస్తారు. అటు దేవయ్య కూడా నాటకమాడి తల్లికి బుద్ధి వచ్చేట్టుచేసి, లక్ష్మిని, తండ్రిని కలుపుతాడు. రెండు జంటలు కలవడంతో చిత్రం సుఖాంతమవుతుంది.
టీవి రాజు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో వరకట్న దురాచారం పై సినారే రాసిన ఇదేనా మన సంప్రదాయమిదేనా పాట అప్పట్లో ఆదరణ పొందింది. అలాగే మరదల మరదల తమ్ముని పెళ్ళామా పాట ఆకట్టుకుంది.
ఎన్.టి.ఆర్ పంచకట్టు అప్పటికి కొత్త ట్రెండ్. విలన్ గా నటించిన రాజనాల పై చక్కటి పాట 'సైసై జోడెడ్ల బండి' చిత్రీకరించడం విశేషం.*
No comments:
Post a Comment