ధర్మదాత (1970)
తమిళంలో 1968 లో వచ్చిన "ఎంగ ఊర్ రాజా" చిత్రం ఆధారంగా ఎ.సంజీవి దర్శకత్వంలో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ధర్మదాత చిత్రం 1970 లో విడుదలయింది. బాలమురుగన్ కథకు పినిశెట్టి మాటలు రాశారు. స్క్రీన్ ప్లే లో తమ్మారెడ్డి కృష్ణమూర్తికి యద్దనపూడి సులోచనారాణి సహకారం అందించారు. ఈ చిత్రానికి తండ్రీకొడుకులుగా అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం ప్రధాన ఆకర్షణ.
శ్రీపురం జమీందార్ రాజా రఘుపతిరావు (ఏఎన్ఆర్) మంచితనానికి, దానధర్మాలకు పెట్టింది పేరు. భార్య సుశీల(జానకి), సోదరి లక్ష్మి(ఝాన్సీ), ఇద్దరు కుమారులు శేఖర్ (ఏఎన్ఆర్) చక్రవర్తి (పద్మనాభం)తో సంతోషంగా ఉంటాడు.భాగేశ్వరం జమీందార్ భుజంగంరావు(నాగభూషణం రఘుపతిరావుపై అసూయతో, తన కుమారుడు రాజుకు లక్ష్మితో వివాహం జరిపించి అతని ఆస్తిని కాజేయాలని చూస్తాడు. వివాహ సమయంలో దానధర్మాల కారణంగా దివాళా తీయడంతో రాజా రఘుపతిరావు కట్నంలో కొంత భాగాన్ని చెల్లించలేకపోతాడు. మాట తప్పలేక తన శ్రీనిలయ భవనాన్ని తాకట్టు పెడతాడు. ఈ విషయం తెలుసుకున్న భుజంగరావు అతనిని అవమానిస్తాడు. ఆగ్రహించిన రఘునాథరావు,తన శ్రీనిలయాన్ని తిరిగి పొంది భుజంగం రావు తన పాదాలను తాకేలా చేస్తానని సవాలు విసురుతాడు. ఆ తర్వాత, సుశీల జయ (అనిత) అనే ఆడబిడ్డకు జన్మనిచ్చి మరణిస్తుంది. ఆమె అంత్యక్రియలకు లక్ష్మి వెళ్లకుండా భుజంగం అడ్డుకుంటాడు. దుఃఖంతో కుంగిపోయిన రఘుపతిరావు శ్రీనిలయాన్ని తిరిగి తీసుకువస్తామని తన పిల్లల చేత ప్రమాణం చేయించుకుంటాడు . శేఖర్, చక్రవర్తి, జయ పెద్దవారవుతారు. శేఖర్ ఇంజినీర్ అవుతాడు. లక్ష్మిని సోదరుడి కుటుంబానికి దగ్గర చేసే ప్రయత్నంగా ఆమె కూతురు పద్మ (కాంచన) తానెవరో చెప్పకుండా శేఖర్‌తో పరిచయం పెంచుకుని, వారి ఇంట్లో సర్దుకుపోతుంది. లక్ష్మి తన కొడుకు ప్రసాద్ (ఈశ్వరరావు), జయ మధ్య ప్రేమే చిగురిస్తుంది. అతడేవరో తెలిసిన శేఖర్ వారి పెళ్లికి నిరాకరిస్తాడు. కొంతకాలం తర్వాత, పద్మ గురించిన నిజం తెలిసి ఆమెను దూరం పెడతాడు. రఘుపతిరావు శ్రీనిలయాన్ని తిరిగి పొందకుండా భుజంగం వడ్డీ వ్యాపారి సేథ్ దయారామ్‌తో రఘుపతిరావును బెదిరించించి, వారి కష్టార్జితాన్ని దొంగిలిస్తాడు.ఆ సమయంలో, రఘుపతి రావు కుమారులు అతన్ని నిందించి ఒంటరిగా వదిలేయడంతో, అతను పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత పద్మ ద్వారా శేఖర్ భుజంగరావు కుట్ర తెలుసుకుని తమ డబ్బును తిరిగి పొందుతాడు. అప్పటికే, భుజంగరావు ఆ భవనాన్ని పేల్చివేయడానికి కుట్ర పన్నడంతో, పిచ్చివాడైన రఘుపతిరావు తన శ్రీనిలయాన్ని రక్షించుకోవడానికి శ్రీపురం చేరుకుంటాడు. తన కుమారుల సహాయంతో భుజంగరావుకు గుణపాఠం నేర్పి తన ఆస్తిని తిరిగి పొందుతాడు. సోదరి బిడ్డలతో శేఖర్, జయ పెళ్లిళ్లు, ప్రేమించిన విజయపురి యువరాణి (గీతాంజలి) తో చక్రవర్తి పెళ్లి జరుగుతాయి.
ఈ చిత్రం 13 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. ఉత్తమ చిత్రంగా. ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.
ఈ చిత్రానికి, సంగీతం తాతినేని చలపతిరావు సమకూర్చారు. సినారే రాసిన జో లాలి, చిన్నారి బుల్లెమ్మ, జగదీశ్వరి, ఓ నాన్న, ఎవ్వరి కోసం ఎవరున్నారు, హలో ఇంజినీర్ పాటలు ఇప్పటికీ పలకరిస్తాయి.*
No comments:
Post a Comment