Wednesday, 2 September 2026

శ్రీ దత్తాత్రేయ సంక్షిప్త చరిత్ర

 


దత్తాత్రేయ సంక్షిప్త చరితం (జీడిగుంట నాగేశ్వర రావు)

దత్తాత్రేయ స్వామి చరిత్ర అత్యంత మహిమాన్వితమైనది. ఆయన "త్రిమూర్తి స్వరూపం". 

చిత్రకూట పర్వతాల చెంత అత్రి మహర్షి, అనసూయ దేవి నివసించేవారు. అనసూయమ్మ పాతివ్రత్యం ముల్లోకాల్లో మారుమోగిపోయింది. ఆమె శక్తిని పరీక్షించడానికి త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) దిగివచ్చారు. వారు అతిథులుగా వచ్చిఆమెను "నిర్వస్త్రగా భోజనం వడ్డించు" అని అడిగారు.

అనసూయ తన భర్త పాదతీర్థాన్ని వారిపై చల్లి, వారిని ముగ్గురు పసిబిడ్డలుగా మార్చివేసింది. ఆ తర్వాత అమ్మలా వారికి పాలిచ్చి లాలించింది. లక్ష్మీ, సరస్వతి, పార్వతులు వచ్చి వేడుకోగా, త్రిమూర్తులు తిరిగి తమ రూపం పొంది, ఆమె భక్తికి మెచ్చి ఆ ముగ్గురి అంశలతో ఒకే శిశువుగా జన్మించారు. ఆయనే దత్తాత్రేయుడు.

దత్తాత్రేయుడు దిగంబరుడిగా, చేతిలో జపమాల, కమండలం ధరించి కనిపిస్తాడు. ఆయన చుట్టూ నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు సంకేతం. ఆయన వెనుక ఉన్న ఆవు భూమాతకు సంకేతం.

—-------

శ్రీమద్భాగవతం ప్రకారం, దత్తాత్రేయుడు ప్రకృతిలోని అంశాలను చూసి జీవిత సత్యాలను నేర్చుకున్నారు. దత్తాత్రేయుడు ఒక గురువుగా ఉంటూ, ప్రకృతిలోని 24 మందిని తన గురువులుగా స్వీకరించి, వాటి నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నారు. వాటిలో -

1. భూమి: ఓర్పు (ఎంత తవ్వినా, తొక్కినా భరిస్తుంది).

2. గాలి: అంటీఅంటనట్లు ఉండటం (సువాసనను, దుర్వాసనను మోసినా తను మాత్రం నిర్మలంగానే ఉంటుంది).

3. ఆకాశం: ఆత్మ సర్వవ్యాపి అని తెలుసుకోవడం.

4. నీరు: స్వచ్ఛత,మధుర స్వభావం.

5. అగ్ని: జ్ఞానాగ్నితో పాపాలను దహించడం.

6. చంద్రుడు: దేహానికి పెరుగుదల, తరుగుదల ఉంటాయి కానీ ఆత్మకు కావని గ్రహించడం.

7. సూర్యుడు: ప్రతిఫలం ఆశించకుండా వెలుగునివ్వడం.

8. పావురం: అతిగా బంధాలు పెంచుకుంటే దుఃఖం తప్పదని నేర్చుకోవడం.

9. కొండచిలువ: దొరికిన దానితో తృప్తి చెందడం.

10. సముద్రం: గంభీరంగా, ప్రశాంతంగా ఉండటం.

11. మిడత: ఇంద్రియ చాపల్యానికి లోనై నాశనం కాకూడదని హెచ్చరిక.

12. తేనెటీగ: సారాంశాన్ని మాత్రమే గ్రహించడం.

13. ఏనుగు: కామవాంఛల వల్ల బంధీ కాకూడదని తెలుసుకోవడం.

14. తేనె సేకరణ్ణి: కష్టపడి సంపాదించినది అనుభవించకపోతే ఇతరుల పాలు అవుతుందని గ్రహించడం.

15. జింక: శబ్దానికి (పొగడ్తలకు) లొంగిపోకూడదని నేర్చుకోవడం.

16. చేప: జిహ్వ చాపల్యం (రుచి) ప్రాణాంతకమని తెలుసుకోవడం.

17. పింగళ (వేశ్య): ఆశ నిరాశ అయితేనే శాంతి లభిస్తుందని గ్రహించడం.

18. కురర పక్షి: వస్తువులపై మమకారం వదిలేస్తేనే సుఖం ఉంటుందని తెలుసుకోవడం.

19. బాలుడు: నిశ్చింతగా, గతాన్ని తలవకుండా ఉండటం.

20. కన్య: ఒంటరిగా ఉన్నప్పుడే ఏకాగ్రత సాధ్యమని (గాజుల చప్పుడు ఉదాహరణ) గ్రహించడం.

21. బాణము చేసేవాడు: లక్ష్యంపై తిరుగులేని ఏకాగ్రత.

22. పాము: ఇల్లు కట్టుకోకుండా ఎక్కడైనా నివసించే వైరాగ్యం.

23. సాలీడు: భగవంతుడు తన నుంచే సృష్టిని తీసి, మళ్ళీ తనలోనే లీనం చేసుకుంటాడని గ్రహించడం.

24. భ్రమరకీటం: ధ్యానం ద్వారా మనం దేనిని తలుచుకుంటామో అదే అవుతామని (కీటకం భ్రమరంగా మారడం) తెలుసుకోవడం.

—----------------

"శ్రీ గురుచరిత్ర" అనే గ్రంథం దత్తాత్రేయుడి లీలలకు నిలయం. ఆయనను నమ్మిన భక్తులకు కరువు కాటకాలు ఉండవు, రోగాలు నయమవుతాయి. ఆయన కేవలం భక్తిని మాత్రమే చూస్తారు. కులమతాలకు అతీతంగా అందరినీ ఆశీర్వదిస్తారు.

దత్తాత్రేయ స్వామి మహిమలు అపారమైనవి. ఆయనను "స్మర్తృగామి" అని పిలుస్తారు, అంటే భక్తులు స్మరించిన మరుక్షణమే ఏ రూపంలోనైనా  అక్కడ ప్రత్యక్షమై రక్షించేవాడని అర్థం. హైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు దత్తుడిని సేవించి వెయ్యి చేతులు, అజేయమైన శక్తిని వరంగా పొందాడు. అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి వారిని మోక్ష మార్గంలో నడిపించారు.

దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపం కాబట్టి, ముగ్గురు అమ్మవార్ల (లక్ష్మి, సరస్వతి, పార్వతి) అంశతో పుట్టిన శక్తిని అనఘా దేవి అని పిలుస్తారు. "అనఘ" అంటే 'పాపం లేనిది' లేదా 'పుణ్యప్రదమైనది' అని అర్థం.

పురాణాల ప్రకారం, దత్తాత్రేయుడు తన యోగ శక్తిని పరీక్షించుకోవడానికి, లోకానికి ఒక పాఠం నేర్పడానికి చాలా కాలం పాటు నీటి అడుగున తపస్సు చేశారు. ఆయన బయటకు వచ్చినప్పుడు తన వెంట ఒక స్త్రీని (అనఘా దేవి), చేతిలో మధుపాత్రను పట్టుకుని వచ్చారు. జనులు అది చూసి "ఈయన సన్యాసి కాదు, భోగి" అని తప్పుగా భావించి దూరమయ్యారు. కానీ నిజమైన జ్ఞానులు ఆమెను సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా, ఆ మధువును అమృతంగా గుర్తించి ఆయనను సేవించారు. మార్గశిర మాసం, కృష్ణ పక్ష అష్టమి తిథిని అనఘాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున దత్తాత్రేయుడిని, అనఘా దేవిని కలిపి పూజించడం వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

—-------------------

దత్తాత్రేయుడు"పురుష" తత్వానికి సంకేతమైతే, అనఘా దేవి "ప్రకృతి" తత్వానికి సంకేతం. వీరిద్దరినీ కలిపి "అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి" అని పిలుస్తారు. చాలా దత్త క్షేత్రాలలో దత్తుడి పాదుకలతో పాటు అనఘా దేవి విగ్రహం లేదా యంత్రం కూడా ఉంటుంది.

దత్తాత్రేయుడు సంచార యోగి. ఆయన ఒకే చోట ఉండకుండా, లోక కల్యాణం కోసం నిరంతరం సంచరిస్తూ ఉండేవారు. దత్తాత్రేయుడి మహిమలు కేవలం అద్భుతాలు మాత్రమే కాదు, అవి భక్తులలో జ్ఞానాన్ని నింపే పాఠాలు. దత్తాత్రేయుడికి అవతార "ముగింపు" లేదా "మరణం" అనేది లేదు. ఆయన చిరంజీవి. ఆయన భౌతిక రూపం ఒకానొక సమయంలో అదృశ్యమైనప్పటికీ, సూక్ష్మ రూపంలో ఆయన ఎప్పుడూ ఉంటారని భక్తుల నమ్మకం. ఆయన గిర్నార్ పర్వత శిఖరాలపై లేదా సహ్యాద్రి అడవులలో తపస్సు చేసుకుంటూ ఉంటారని చెబుతారు.

దత్తాత్రేయ పురాణం ప్రకారం ఆయన 16 ప్రధాన రూపాల్లో దర్శనమిచ్చారు:

1. యోగిరాజ: కార్తీక పౌర్ణమి నాడు ఉద్భవించిన మొదటి రూపం.

2. అత్రివరద: అత్రి మహర్షికి వరంగా జన్మించిన రూపం.

3. దత్తాత్రేయ: అనసూయమ్మకు పుత్రుడిగా వెలసిన రూపం.

4. కాలాగ్నిశమన: పాపాలను దహించే రూపం.

5. యోగీజనవల్లభ: యోగులకు ప్రియమైనవాడు.

6. లీలావిశ్వంభర: సృష్టిని లీలగా నడిపించేవాడు.

7. సిద్ధరాజ: సకల సిద్ధులకు అధిపతి.

8. జ్ఞానసాగర: జ్ఞానానికి నిలయం.

9. విశ్వంభర: జగత్తును భరించేవాడు.

10. మాయాముక్త: మాయకు అతీతుడు.

11. మాయాయుక్త: మాయను ఆయుధంగా మలచుకున్నవాడు.

12. ఆదిగురువు: మొదటి గురువు.

13. దేవదేవ: దేవుళ్ళకే దేవుడు.

14. దిగంబర: ఆకాశమే వస్త్రంగా గలవాడు.

15. కృష్ణశ్యామకమలనయన: నీలమేఘ శ్యాముడు.

16. యోగీశ్వర: యోగ విద్యకు ఈశ్వరుడు.

—--------------

దత్తాత్రేయుడు నేరుగా అదృశ్యమయ్యాక, కలియుగంలో తన కార్యాన్ని కొనసాగించడానికి శ్రీపాద శ్రీవల్లభులు, నరసింహ సరస్వతి, స్వామి సమర్థ, మాణిక్య ప్రభు వంటి రూపాలలో అవతరించారు. షిర్డీ సాయి బాబా కూడా దత్త అవతారంగానే భావిస్తారు.

శ్రీపాద శ్రీవల్లభ స్వామి (ప్రథమావతారం)

కలియుగంలో శ్రీ దత్తాత్రేయుని మొదటి ప్రత్యక్ష రూపం ఇది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలోని పీఠాపురం (పిఠాపురం) క్షేత్రంలో అప్పలరాజు శర్మ, సుమతీదేవి దంపతులకు భాద్రపద శుద్ధ చవితి నాడు జన్మించారు.

నవజాత శిశువు పాదములపై పద్మరేఖలు, దివ్య చిహ్నాలు ఉండటంచేత "శ్రీపాద" అని, లక్ష్మీదేవి (శ్రీ) కటాక్షం పొందిన సద్గురు స్వరూపం కావడం వల్ల "శ్రీవల్లభ" అని పేరు పెట్టారు.

చిన్నతనం నుంచే అనేక వేద వేదాంగాలను అభ్యసించకుండానే చదివి వినిపించారు.

వారి ఇంట్లో తన కంటే ముందు జన్మించిన అంధుడు, వికలాంగుడైన ఇద్దరు అన్నలకు కేవలం తమ దివ్య స్పర్శతో క్షణాల్లో పూర్ణ స్వస్థత చేకూర్చారు.

తల్లిదండ్రుల అంగీకారంతో చిన్న వయస్సులోనే సన్యాస శ్రమ స్వీకరించి దేశాటన చేశారు.

హిమాలయాలు, కాశి, బదరీకేదార్, గోకర్ణం, శ్రీశైలం వంటి అనేక పవిత్ర దివ్య క్షేత్రాలను దర్శించి దత్త జ్ఞానాన్ని పంచిపెట్టారు.

అనంతరం కురువపురం (తెలంగాణ-కర్ణాటక సరిహద్దులలోని కృష్ణా నదీ తీరం) లో స్థిరపడి, అనేక మంది భక్తులకు జ్ఞానబోధ చేసి, అనేక అద్భుత లీలలను ప్రదర్శించారు.

కృష్ణా నదిలో నిత్యం బట్టలు ఉతికే ఒక నిరుపేద రజకుడిభక్తికి మెచ్చి, తదుపరి జన్మలో ఒక రాజ్యాన్ని ఏలే రాజుగా జన్మిస్తావని అభయమిచ్చారు (ఆ రజకుడే తర్వాతి జన్మలో బహుమనీ సుల్తానుగా జన్మించి, దత్తాత్రేయుని ద్వితీయావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి సేవలు చేసారు).

తన కుమారుడు మూర్ఖుడని బాధపడుతూ ఆత్మహత్యకు సిద్ధపడిన ఒక స్త్రీకి అభయమిచ్చి, ఆమె కుమారుడిని వేద పండితుడిగా మార్చారు. ఆ స్త్రీకి తర్వాతి జన్మలో శ్రీ నృసింహ సరస్వతి స్వామికి తల్లి (అంబిక) అయ్యే మహాభాగ్యాన్ని ప్రసాదించారు.

శ్రీపాద శ్రీవల్లభ స్వామి తమ 30వ ఏట, ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు కురువపురంలో కృష్ణా నదిలో అంతర్ధానమై గుప్త రూపం దాల్చారు. ఈ రోజునే గురు ద్వాదశిగా జరుపుకుంటారు.

ఆయన భౌతిక రూపం చాలించినప్పటికీ, కురువపురంలో నేటికీ సూక్ష్మ రూపంలో సంచరిస్తూ భక్తుల కోరికలు తీరుస్తారని విశ్వసిస్తారు.

శ్రీపాదుల సమకాలీనుడైన శంకరాభట్టు అనే భక్తుడు శ్రీపాదుల దివ్య జీవిత విశేషాలను, లీలలను "శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం" అనే మహా గ్రంథంగా రచించారు.

ఈ గ్రంథ పారాయణం వల్ల సమస్త పాపాలు నివారించబడి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

పిఠాపురం క్షేత్ర ప్రాముఖ్యత

శ్రీపాదుల వారు జన్మించిన స్వగృహ స్థలంలో నిర్మించిన దివ్య మందిరం ఇది. ఇక్కడ స్వామివారి దివ్య పాదుకలను ప్రతిష్ఠించారు. భక్తులు దర్శించి తరించే ప్రధాన ప్రదేశం ఇదే. పిఠాపురంలో స్వామివారి పాదముద్రలు స్వయంభూగా వెలసిన ప్రదేశాన్ని 'పాదవగయ' అంటారు. శ్రీపాదుల వారి మాతామహులు (తాత) అయిన బాపనార్యుల వారి ఇంటి ఆవరణలో ఉన్న బావి నీటిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. శ్రీపాద సంస్థానంలో నిరంతరం నిత్యాన్నదానం జరుగుతుంది. దత్త క్షేత్రాలలో అన్నదానానికి ఉన్న ప్రాముఖ్యత ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది.

పిఠాపురం కేవలం దత్త క్షేత్రమే కాదు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. సతీదేవి శరీర భాగాలలో ఎడమ చేతి భాగం (కుడి కుచం అని కూడా చెబుతారు) ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని శ్రీ పురుహుతికా దేవి అని ఆరాధిస్తారు.

పిఠాపురంలో మరో అతి పురాతనమైన విశేషం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయం. గయాసురుడు అనే రాక్షసుని పాదాలు ఈ ప్రాంతంలో పడినందున దీనిని పాదగయ క్షేత్రంగా పిలుస్తారు (శిరస్సు బీహార్ లోని గయలో, నాభి ఒరిస్సాలోని నాభిగయ లేదా జాజ్‌పూర్‌లో పడ్డాయని ప్రతీతి). కనుక ఇక్కడ పితృకర్మలు, పిండ ప్రదానాలు చేయడం విశేష ఫలప్రదంగా భావిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో కుక్కుటేశ్వర స్వామి (శివుడు), రాజరాజేశ్వరి అమ్మవారు, హుంకారిణీ దేవి దర్శనమిస్తారు. ( ఇంకా ఉంది.) 

—--------

దత్తాత్రేయుని రెండో అవతారం నృసింహ సరస్వతి. మహారాష్ట్రలోని వాశిమ్ జిల్లాకు చెందిన కరంజా (కరణపుర) గ్రామంలో ఆపస్తంబ సూత్రుడైన మాధవ్, అంబిక దంపతులకు భాద్రపద బహుళ పాడ్యమి నాడు జన్మించారు. తల్లిదండ్రులు వీరికి "నరహరి" లేదా "శాలిగ్రామ్" అని నామకరణం చేశారు.

స్వామివారు జన్మించినప్పటి నుంచి న 'ఓం' అనే ప్రణవ నాదం తప్ప మరే మాట మాట్లాడలేదు. తల్లిదండ్రులు ఆందోళన చెందగా, ఉపనయనం చేస్తే మాట్లాడతానని సంకేతం ఇచ్చారు.

7వ ఏట ఉపనయనం కాగానే, వారు ఏ గ్రంథాలూ చదవకుండానే నాలుగు వేదాలను, వేదాంగాలను అత్యంత స్పష్టంగా ఉచ్చరించి తల్లిదండ్రులను, సభలోని వేద పండితులను దిగ్భ్రాంతికి గురిచేశారు.

ఉపనయనం పూర్తయిన వెంటనే సన్యాస జీవితం వైపు అడుగులు వేశారు. తల్లిదండ్రుల అనుమతితో కాశీ క్షేత్రానికి చేరుకుని, అక్కడ ఉన్న శ్రీ కృష్ణ సరస్వతి అనే యతివరేణ్యుల వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. అప్పుడే వీరికి "శ్రీ నృసింహ సరస్వతి" అనే నామధేయం సిద్ధించింది.

స్వామివారు తమ జీవితకాలంలో అనేక పవిత్ర క్షేత్రాలలో సంచరిస్తూ, కోట్లాదిమంది భక్తుల పాపాలను, వ్యాధులను పరిహరించారు:

కృష్ణా-పంచగంగా నదుల సంగమ క్షేత్రమైన నరసోబావాడి (నృసింహవాడి) వద్ద స్వామివారు 12 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశారు.

అనంతరం కర్ణాటకలోని గాణాగాపూర్ (భీమా-అమర్జా నదుల సంగమం) చేరుకుని సుమారు 24 సంవత్సరాలు ఆక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.

అక్కడ ఎన్నో లీలలు చేశారు. ఒక పేద బ్రాహ్మణుడి అకాల మరణం చూసి చలించిన స్వామివారు, తమ దివ్య శక్తితో అతనికి తిరిగి ప్రాణదానం చేశారు.

ఒక నిరుపేద బ్రాహ్మణుడి ఇంట్లో కాపురానికి పనికిరాని, ఎండిపోయిన ముసలి ఎద్దుతో పాలు పితికించి ఆ కుటుంబ దారిద్ర్యాన్ని పోగొట్టారు.

చదువు రాని ఒక అమాయక మూగ యువకుడి శీరస్సుపై చేయి ఉంచి అతడిచే సమస్త వేదాలను చెప్పించారు.

పండిత గర్వంతో ఉన్నవారికి దత్తజ్ఞానాన్ని బోధించి ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లించారు.

దత్త భక్తులకు అత్యంత పవిత్రమైన "శ్రీ గురుచరిత్ర" గ్రంథం ప్రధానంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి జీవిత చరిత్ర, లీలల ఆధారంగానే సరస్వతి గంగాధర్ రాశారు. ఈ గ్రంథ పారాయణ చేయడం వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయని భక్తుల దృఢ విశ్వాసం.

తమ అవతార కార్యం పూర్తయిందని భావించి, గాణాగాపూర్ లోని భక్తుల రక్షణార్థం నిర్గుణ పాదుకలను అక్కడ ప్రతిష్ఠించారు. అనంతరం ఆశ్వయుజ బహుళ పాడ్యమి నాడు కదలీవనం (శ్రీశైల క్షేత్ర సమీపంలో ఉండే దట్టమైన అటవీ ప్రాంతం) వైపు పయనమై అక్కడ అంతర్ధానమయ్యారు.

నేటికీ గాణాగాపూర్ క్షేత్రంలో స్వామివారు సూక్ష్మ రూపంలో సంచరిస్తూ, మధ్యాహ్నం వేళ భిక్ష స్వీకరిస్తారని భక్తులు నమ్ముతారు.

—---------

శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మూడవ ప్రత్యక్ష అవతారమైన శ్రీ మాణిక్య ప్రభు  మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దుల్లోని లాడ్ వంతి (అనే గ్రామంలో సుమంగళీ బాయి, మనోహర్ నాయక్ దంపతులకు మార్గశిర శుద్ధ ఏకాదశి (గీతా జయంతి) నాడు జన్మించారు.

జన్మించిన సమయంలో శిశువు శరీరం అత్యంత దివ్యమైన కాంతితో, మాణిక్యం వలే మెరిసిపోవడంతో వీరికి "మాణిక్య" అని నామకరణం చేశారు.

చిన్నతనం నుంచే ఆడుకునే వయస్సులోనే అనేక మహిమలు చూపేవారు. తోటి పిల్లలతో అడవులకు వెళ్లి ధ్యానం చేయడం, ప్రకృతిలోని సమస్త జీవులతో ప్రేమగా ఉండడం చేసేవారు.

బాల్యంలోనే గృహాన్ని వదిలి దేశాటనకు బయలుదేరి కాశి, బదరీకేదార్, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించారు.

అనంతరం కర్ణాటకలోని బీదర్ సమీపంలో ఉన్న ఒక నిర్జన అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని, అక్కడ ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆ ప్రదేశమే తర్వాతి కాలంలో "మాణిక్యనగర్" అనే పవిత్ర దత్తక్షేత్రంగా రూపొందింది.

మాణిక్య ప్రభువులు మత భేదాలకు అతీతంగా ధర్మాన్ని బోధించారు. హిందువులు, ముస్లింలు, శిక్కులు అందరూ వీరిని తమ సద్గురువుగా ఆరాధించేవారు.

వీరు స్థాపించిన పీఠంలో "సకలమత సంప్రదాయం" అనే సూత్రం ప్రకారం సర్వ మానవ సౌబ్రాతృత్వాన్ని ప్రచారం చేశారు.

శ్రీ మాణిక్ ప్రభువును ముస్లిం భక్తులు 'మెహబూబ్ సుభానీ' అవతారంగా, లింగాయత్ భక్తులు 'బసవన్న' రూపంగా భావిస్తారు. వీరు 'రాజయోగి'గా జీవించారు. వీరి వద్దకు వచ్చిన పేదలకు, పండితులకు, దీనులకు అడిగినంత ధనాన్ని, సహాయాన్ని ప్రసాదించేవారు. వీరి దర్బారులో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం తాండవిస్తూ ఉండేదని, ఎందరో ఆకలితో ఉన్నవారికి రోజూ నిత్యాన్నదానం జరిగేదని ప్రసిద్ధి.

శ్రీ మాణిక్య ప్రభువులు తమ 47వ ఏట మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మాణిక్యనగర్‌లో భక్తుల సమక్షంలో ప్రశాంతంగా సజీవ సమాధి నిష్ఠలోకి వెళ్లారు. 

నేటికీ కర్ణాటకలోని బీదర్ జిల్లా మాణిక్యనగర్ లో వీరి దివ్య సమాధి మందిరం ఉంది. అక్కడికి వెళ్లి దర్శించుకున్న భక్తులకు లక్ష్మీ కటాక్షం, మనశ్శాంతి లభిస్తాయని విశ్వసిస్తారు.

———————

 శ్రీ దత్తాత్రేయ స్వామి మూడవ ప్రత్యక్ష అవతారమైన శ్రీ మాణిక్య ప్రభు మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దుల్లోని లాద్వంతి గ్రామంలో సుమంగళీ బాయి, మనోహర్ నాయక్ దంపతులకు మార్గశిర శుద్ధ ఏకాదశి (దత్త  జయంతి) నాడు జన్మించారు.

జన్మించిన సమయంలో శిశువు శరీరం అత్యంత దివ్యమైన కాంతితో, మాణిక్యం వలే మెరిసిపోవడంతో వీరికి "మాణిక్య" అని నామకరణం చేశారు.

చిన్నతనం నుంచే ఆడుకునే వయస్సులోనే అనేక మహిమలు చూపేవారు. తోటి పిల్లలతో అడవులకు వెళ్లి ధ్యానం చేయడం, ప్రకృతిలోని సమస్త జీవులతో ప్రేమగా ఉండడం చేసేవారు.

బాల్యంలోనే గృహాన్ని వదిలి దేశాటనకు బయలుదేరి కాశి, బదరీకేదార్, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించారు.

అనంతరం కర్ణాటకలోని బీదర్ సమీపంలో ఉన్న ఒక నిర్జన అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని, అక్కడ ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆ ప్రదేశమే తర్వాతి కాలంలో "మాణిక్యనగర్"  అనే పవిత్ర దత్తక్షేత్రంగా రూపొందింది.

మాణిక్య ప్రభువులు మతాలకు అతీతంగా ధర్మాన్ని బోధించారు. హిందువులు, ముస్లింలు, శిక్కులు అందరూ వీరిని తమ సద్గురువుగా ఆరాధించేవారు.

వీరు స్థాపించిన పీఠంలో "సకలమత సంప్రదాయం" అనే సూత్రం ప్రకారం సర్వ మానవ సౌబ్రాతృత్వాన్ని ప్రచారం చేశారు.

వీరు 'రాజయోగి'గా జీవించారు. వీరి వద్దకు వచ్చిన పేదలకు, పండితులకు, దీనులకు అడిగినంత ధనాన్ని, సహాయాన్ని ప్రసాదించేవారు.

వీరి దర్బారులో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం తాండవిస్తూ ఉండేదని, ఎందరో ఆకలితో ఉన్నవారికి రోజూ నిత్యాన్నదానం జరిగేదని ప్రసిద్ధి.

శ్రీ మాణిక్య ప్రభువులు తమ 47వ ఏట మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు మాణిక్యనగర్‌లో భక్తుల సమక్షంలో ప్రశాంతంగా సజీవ సమాధి నిష్ఠలోకి వెళ్లారు.

నేటికీ కర్ణాటకలోని బీదర్ జిల్లా మాణిక్యనగర్ లో వీరి దివ్య సమాధి మందిరం ఉంది. అక్కడికి వెళ్లి దర్శించుకున్న భక్తులకు లక్ష్మీ కటాక్షం, మనశ్శాంతి లభిస్తాయని విశ్వసిస్తారు.

—————

దత్తాత్రేయ స్వామి నాల్గవ ప్రత్యక్ష అవతారమైన శ్రీ స్వామి సమర్థ (అక్కల్కోట్ మహారాజ్) ఆవిర్భావ సమయం లేదా జన్మస్థలం గురించి కచ్చితమైన ఆధారాలు లేవు. మహారాష్ట్రలోని హరిద్రావళి అడవుల్లో ఒక చెట్టు కింద ఉన్న పుట్ట (వల్మీకం) నుంచి దివ్యమైన కాంతితో అవతరించారని భక్తుల నమ్మకం.

అక్కల్కోట్‌కు రాకముందు స్వామివారు హిమాలయాలు, కాశి, హరిద్వార్, రామేశ్వరం, జగన్నాథ పురి వంటి అనేక పుణ్యక్షేత్రాలలో "చెంచప్ప మహారాజ్", "దిగంబర స్వామి" వంటి విభిన్న నామాలతో సంచరించారు.

కర్ణాటకలోని మాణిక్యనగర్ క్షేత్రంలో శ్రీ మాణిక్య ప్రభువులను కలసి సంభాషించారని దత్త చరిత్రలు పేర్కొంటున్నాయి.

సుమారు 1856 ప్రాంతంలో మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందిన అక్కల్కోట్ నగరం చేరుకుని, అక్కడే దాదాపు 22 సంవత్సరాల పాటు స్థిరంగా ఉన్నారు. అందుకే వీరిని "అక్కల్కోట్ మహారాజ్" అని పిలుస్తారు.

వీరు ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచ స్పృహ లేని దివ్యమైన అవధూత స్థితిలో ఉండేవారు. పసిపిల్లల్లా ప్రవర్తిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేసినట్లే నటిస్తూ భక్తుల అంతరంగంలోని అజ్ఞానాన్ని, పాపాలను దహించివేసేవారు.

స్వామివారి అత్యంత ప్రసిద్ధమైన మహామంత్రం/అభయ వాక్యం:

"భియూ నకోస్, మీ తుఝ్యా పాఠీశీ ఆహే"

(భయపడకు, నేను నీ వెంటే ఉన్నాను)

ఈ మాట నేటికీ కోట్లాదిమంది దత్త భక్తులకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.

వైద్యులకు లొంగని దీర్ఘకాలిక వ్యాధులను, మానసిక సమస్యలను తమ చిన్న చూపుతో, స్పర్శతో, విభూతితో సంపూర్ణంగా నయం చేసేవారు.

తమ వద్దకు వచ్చే భక్తులు నోరు విప్పకుండానే వారి మనస్సులోని కోరికలు, సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపే అమితమైన సర్వజ్ఞత వీరి సొంతం.

రాజుల నుంచి పేదల వరకు, పండితుల నుంచి నిరక్షరాస్యుల వరకు అందరినీ సమదృష్టితో చూశారు.

1878వ సంవత్సరం, చైత్ర బహుళ త్రయోదశి నాడు అక్కల్కోట్ లోని వటవృక్షం (మర్రిచెట్టు) నీడన స్వామి సమర్థులు తమ భౌతిక దేహాన్ని చాలించి మహాసమాధి చెందారు.

నేటికీ అక్కల్కోట్‌లోని "వటవృక్ష సమాధి మందిరం" అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులకు స్వామివారు సూక్ష్మరూపంలో ఉండి ఆదుకుంటారని నమ్మకం. 

—-

దత్తాత్రేయ స్వామి ఐదవ ప్రత్యక్ష అవతారమైన శ్రీ షిర్డీ సాయిబాబా జన్మస్థలం, తల్లిదండ్రులు, అసలు పేరు ఎవరికీ స్పష్టంగా తెలియవు. కులమతాలకు అతీతుడిగా ఉండటానికే ఆయన తన పూర్వాపరాలను అజ్ఞాతంగా ఉంచారు.

యవ్వనంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన షిర్డీ గ్రామానికి చేరుకుని, అక్కడి ఒక వేపచెట్టు కింద ధ్యానం చేస్తూ గ్రామస్థులకు కనిపించారు.

షిర్డీలోని ఒక పాడుబడిన మసీదులో స్థిరపడి, దానికి "ద్వారకామాయి" అని పేరు పెట్టారు. అక్కడ ఎల్లప్పుడూ ధుని  వెలిగిస్తూ ఉండేవారు.

వర్తకులు నూనె ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, ప్రమిదలలో నీళ్లు పోసి దీపాలు వెలిగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ధుని నుంచి వచ్చిన బూడిదను (ఉదీ) భక్తులకు ప్రసాదంగా ఇచ్చి, తీవ్రమైన రోగాలను, కష్టాలను నివారించేవారు.

వర్షాలు, తుఫానులను కేవలం తమ ఆజ్ఞతో శాంతింపజేశారు.

సబ్ కా మాలిక్ ఏక్ (అందరికీ దేవుడు ఒక్కడే) అని బోధిస్తూ హిందూ, ముస్లింల ఐక్యతకు, సర్వమానవ సమభావానికి ప్రతీకగా నిలిచారు.

సద్గురు నందు పరిపూర్ణమైన విశ్వాసం, భక్తి (శ్రద్ధ), ఓపిక, సహనంతో కూడిన నిరీక్షణ సబూరి) బోధించారు. 

"నేను షిర్డీలో లేకపోయినా, నా సమాధి నుంచి నిన్ను కాపాడుతాను", "నా వైపు నువ్వు ఒక అడుగు వేస్తే, నీ వైపు నేను వంద అడుగులు వేస్తాను" అని భక్తులకు మాటిచ్చారు.

1918వ సంవత్సరం విజయదశమి (దసరా) నాటి మధ్యాహ్నం సాయిబాబా షిర్డీలో తమ భౌతిక దేహాన్ని చాలించి మహాసమాధి చెందారు.

ప్రస్తుతం షిర్డీ ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా కోట్లాదిమంది భక్తులు రోజూ బాబాను దర్శించుకుని తరిస్తున్నారు.  దేశ విదేశాల్లో కూడా ఈ నాడు అనేకచోట్ల సాయిబాబా ఆలయాలు వెలిశాయి. 

దత్తాత్రేయ చరిత్ర ఒక నిరంతర ప్రవాహం. ఆయన యోగి, జ్ఞాని, కరుణామయుడు. నేటికీ మహారాష్ట్రలోని గాణగాపురం, ఔదుంబర్, పిఠాపురంలో దత్తాత్రేయుడి శక్తి సజీవంగా ఉందని భక్తుల నమ్మకం.

"అహంకారాన్ని వదిలేయండి, ప్రకృతి నుంచి నేర్చుకోండి, అందరినీ సమానంగా చూడండి" - ఇదే దత్తుడు తన జీవితం ద్వారా ఇచ్చిన గొప్ప సందేశం.

—------

.





No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...